ఓ నవకవీ!
మాధుర్యంలేని
మాటలొద్దు
రుచిపచిలేని
వంటలొద్దు
కూనిరాగాలు తీసి
గొప్పగాయకుడనని గర్వించకు
వెర్రిగంతులు వేసి
నవనాట్యమని నమ్మించకు
చెత్తపాటను వ్రాసి
కొత్తపాటని చెప్పకు
చిట్టికధను వ్రాసి
వచనకవితని వాదించకు
పిచ్చికవితను వ్రాసి
భావకవితని బుకాయించకు
ప్రాసలొదిలి యాసలొదిలి
తోచిందిరాసి తైతక్కలాడకు
శాలువాను కప్పించుకొని
మహాసత్కారమని డబ్బాకొట్టకు
బిరుదులుకొని ఇప్పించుకొని
చంకలుకొట్టి ఎచ్చులకుపోకు
అక్షరాలను చల్లి
అద్భుతకవితని ఎగిరిపడకు
పదాలను పేర్చి
పెద్దకవినని భ్రమించకు
సుభాషితాలు చెప్పు
సత్కార్యాలను చేయించు
భావగర్భితం చెయ్యి
మనసులను వెలిగించు
అందాలను చూపించు
ఆనందాన్ని అందించు
మదులను తట్టు
మరిపించి మురిపించు
దారితప్పిన వారిని
సన్మార్గాన నడిపించు
మారుతున్న కాలానికి
మార్పులను సూచించు
ప్రతికవిత చివర
ఉద్దేశం తెలుపు
కవిహృదయం ఎరిగించు
పాఠకులను కదిలించు
సందేశములేని
రాతలొద్దు
కల్లబొల్లి
కబుర్లొద్దు
గగనానికి గురిపెట్టు
గమ్యాన్ని చేరుకొను
గుర్తింపును పొందు
గర్వపోతువు కాకు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment