కవిగారి భావనలు


కోడినై కూస్తా

లేస్తావా

కోకిలనై పాడుతా

వింటావా


రవినై ప్రభవిస్తా

మేలుకుంటావా

జాబిలినై పొడుస్తా

పరికిస్తావా


పూసగుచ్చినట్టు చెబుతా

పరిగ్రహిస్తావా

మాటలు మధురముగామారుస్తా

మన్నిస్తావా


రంగులద్ది చూపుతా

చూస్తావా

రమ్యంగా తయారుజేస్తా

తిలకిస్తావా


అక్షరసుమాల నల్లుతా

అందుకుంటావా

సుగంధాల చల్లుతా

ఆఘ్రానిస్తావా


పదాలను పేరుస్తా

చదువుతావా

పనసతొనలా చేరుస్తా

చప్పరిస్తావా 


తేనెపలుకులు చల్లుతా

స్వీకరిస్తావా

తీపి పలుకులకంటిస్తా

చవిగొంటావా


ఆలోచనలు పారిస్తా

మదిస్తా శ్రమిస్తా

భావాలు బయటపెడతా

మదిలో నిలుపుకుంటావా


సాహిత్యక్షీరాన్ని తెస్తా

చిలుకుతా

కవితావెన్నను తీస్తా

ఆస్వాదిస్తావా


మనసు పెడతా

చక్కగా వ్రాస్తా

కైతను కళ్ళముందుంచుతా

చదివి సంతసిస్తావా


అందాలను వర్ణిస్తా

చూస్తావా

ఆనందాన్ని పంచుతా

అందుకుంటావా


రాసేది

కలంపట్టి కవిత్వమో

చేసేది 

కత్తిమీద సామో


పడేది

పూలపొగడ్తలో

రాలేది

రాళ్ళవిమర్శలో


చూస్తా

వేచిచూస్తా

చదువుతా

వ్యాఖ్యలుచదువుతా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog