ఎందుకో?
కోయిల ఎందుకు తెరుచు నోరు
నెమలి ఎందుకు పురిని విప్పు
గానము ఎందుకు కొందరికి నచ్చు
నాట్యము ఎందుకు మరికొందరు మెచ్చు
జాబిలి ఎందుకు వెన్నెల కురియు
తారలు ఎందుకు తళతళ మెరియు
చల్లదనానికి హృదయమేల మురియు
చక్కదనానికి మదులేల పొంగిపోవు
పక్షులు ఏల గాలిలోన ఎగురు
మబ్బులు ఏల నింగిలోన తిరుగు
ముచ్చట ఏల చూపరులకు కలుగు
మనసులు ఏల ఆనందంలో మునుగు
ఉరుములు ఏల గర్జనలు చేయు
మెరుపులు ఏల వెలుగులు చిమ్ము
చినుకులు ఏల చిటపటమను
వాగులు ఏల గలగలాపారు
పూవులు ఏల పరిమళాలు విసురు
పిల్లలు ఏల ప్రేమాభిమానాలు చాటు
ప్రకృతి ఏల మనసులను తట్టు
కవులు ఏల కవితలను కూర్చు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment