కవితా స్పందనలు

(కవితాస్వాదనము)


ఒకపడతి యందించె నాకొకపువ్వు 

ఒకటే రేపించె నాలోనాలోచనలు 

కరమున పట్టించె కలముకాగితము 

కమ్మగవ్రాయించె కోరీకొసరీ కవనము 


ఒకవిమర్శకుడిచ్చె పలుసలహాలు

వద్దనివారించె వచననిర్మాణాలు 

పారించమనె ప్రాసలతో పదములు

పండించమనె పసందుగ కవితలు


ఒకరిచ్చె నద్భుతమైనట్టి యొకమెప్పు

ఉదయాన్నె త్రాగించే వేడివేడికాఫీకప్పు

అనిపించెకనిపించె నన్నిటానతనికి నేర్పు

బయటకువెల్లడించకుండె యొక్కటైనా తప్పు


ఒకరుకొట్టే నొకటేచప్పట్లు

చెప్పమనికోరే చాలాముచ్చట్లు

చేతికందించే తియ్యతియ్యనిబొబ్బట్లు

వేసివడ్డించె మూడుముక్కలపెసరట్లు


వ్రాసితి విరులకవితలు 

అంకితమిచ్చితి యోషితకు

పొందితి పెక్కుపొగడ్తలు 

మురిసిపోయితి మదినందు


స్పందించె స్నేహితులు 

పలుకరించె పరిచయస్తులు 

కవితనాస్వాదించె కొత్తవారు 

సంతసించె సాహిత్యలోకంబు 


పాడించితి ప్రబోధగీతాలు

పారించితి ప్రణయకవితలు 

పేర్చితి పువ్వులపాటలు 

కూర్చితి ప్రకృతికైతలు 


కూకూయనిపించితి కోకిలలా  

నాట్యమాడించితి నెమలిలా 

వెన్నెలకురిపించితి జాబిలిలా 

తెలుగునుచిందించితి తేనెలా 


పొంగిపోయితి ప్రోత్సహిస్తే 

సరిదిద్దుకుంటి విమర్శిస్తే 

మురిసిపోయితి మెచ్చుకుంటే 

సవరించుకుంటి సలహాలిస్తే 


ముట్టితే మనసులను 

తట్టితే తలలను 

కట్టేస్తే కళ్ళను 

కాదా కవిత్వము 


పాఠకులకు పలుధన్యవాదాలు

విమర్శకులకు వందనాలు

సలహాలకు సుమాంజలులు

అభిమానులకు అభివందనాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog