లంకెలు

(కవితానందం)


మొక్కలకు పువ్వులు పూచినట్లు

మదిలో తలపులు పొడుచుకొచ్చాయి


తోటలో సీతాకోకచిలుకలు ఎగిరినట్లు

తలచుట్టూ అక్షరాలు ముసురుకున్నాయి


తీగలాగితే డొంక కదలినట్లు

పదంచిక్కగా కవిత కదంత్రొక్కింది


జాడతెలియగా చిక్కుముడి వీడినట్లు

భావంబయటపడగా కైత కళ్ళముందుకొచ్చింది


విషయంతోచగా కవిత్వం దొర్లినట్లు

కలంచిక్కగా కైత ఒలికింది


చెట్టుకదలగా గాలి వీచినట్లు

కవనంసాగగా సౌరభం వెదజల్లింది


తేనెచిందితే తీపి చవిచూపినట్లు

నోరుతెరవగా తెలుగుతేనె దప్పికతీర్చింది


లంకెపడితే జత కుదిరినట్లు

ప్రాసలమరగా పాట పుట్టింది


ఉదయమవగానే వెలుగు వచ్చినట్లు

కవితోదయంకాగానే కాంతులు వెలువడ్డాయి


కన్నుతెరచిచూడ అందం అగుపించినట్లు

కయితచదవినంత ఆనందం ఆవరించింది


పట్టుకొనిలాగి సహాయకుడుపైకి ప్రాకించినట్లు

ప్రక్కనుండి సాహితి సుకవితనువ్రాయించింది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog