ఊరకుండేదిలేదు ఒట్టిగా!
ఏదైనా!
ఏమైనా!
ఊరకుండేదిలేదు
ఒట్టిగా!
కనిపించనీ! కనిపించకపోనీ!
ప్రకృతి అందచందాలు
వికసించిన విరులు
అంబుధినందు అలలు
మింటిలో మేఘాలు
నర్తించే నెమలులు
పచ్చని చిలుకలు
ప్రవహించే నదులు
కాకులుదూరని కారడవులు
గలగలసాగే సెలయేర్లు
ప్రసరించనీ! ప్రసరించకపోనీ!
కమలాప్తునినుండి కిరణాలు
వెన్నెలరాయుని వన్నెచిన్నెలు
తారకలువెదజల్లు తళతళలు
మెరుపులయొక్క మెరుపులు
మోములందు చిరునగవులు
వినిపించనీ! వినిపించకపోనీ!
తియ్యని తెలుగుపలుకులు
పసందుకొలిపే పద్యాలు
పరవశపరచే పాటలు
పసిపాపల ముద్దుమాటలు
కోకిలమ్మల కుహూకుహులు
రానీ! రాకపోనీ!
పేరుప్రఖ్యాతులు
భుజంపై శాలువాలు
మెడకు పూలదండలు
చేతికి పుష్పగుచ్ఛాలు
సన్మాన సత్కారాలు
పత్రికలలో వార్తలు
టీవీలలో వీడియోలు
పోనీ! పోతేపోనీ!
సతియు హితులు
తల్లియు తండ్రియు
కొడుకులు కోడళ్ళు
కూతుర్లు అల్లుళ్ళు
మనుమళ్ళు మనుమరాళ్ళు
చదవనీ! చదవకపోనీ!
కష్టపడివ్రాసిన కవితలు
అందంగా అల్లిన అక్షరాలు
పారించిన పదములు
ప్రయోగించిన ప్రాసలు
వాడిన ఉపమానాలు రూపకాలు
ఏదైనా! ఏమైనా!
విడిచేదిలేదు కలమును
మూసేదిలేదు గళమును
ఆపేదిలేదు ఆలోచనలను
దాచేదిలేదు భావాలను
ఊరకుండేదిలేదు ఉత్తుత్తిగాను
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment