ఓ మంచి దేవుడా!


అడగకుండానే

అవనికి పంపించావు

అమ్మానాన్నలనిచ్చావు

ఆరోగ్యభాగ్యాలిచ్చావు


ఆకలి తీర్చటానికి

అమ్మకు పాలివ్వమన్నావు

అయ్యకు పైకంబునిచ్చావు

ఆహారపానీయాలందించావు


శ్రమించమని చేతులిచ్చావు

కదలటానికి కాళ్ళనిచ్చావు

కాంచటానికి కళ్ళనిచ్చావు

మనసులకు మేధస్సునిచ్చావు


ఆడుకోటానికి

ఆటలనిచ్చావు

అక్కాచెల్లెలునిచ్చావు

అన్నాదమ్ములనిచ్చావు


నమలటానికి

నోరునిచ్చావు

తినటానికి

తిండినిచ్చావు


పలకాబలపమిచ్చావు

పాఠశాలకుపంపించావు

పంతులగార్లనిచ్చావు

పాఠాలు నేర్పించావు


ఆ ఆ లను

దిద్దించావు

అమ్మ ఆవుల

పలికించావు


పచ్చని చెట్లనిచ్చావు

రంగుల పూలనిచ్చావు

నల్లని జుట్టునిచ్చావు

తెల్లని పల్లునిచ్చావు


నెత్తికి జుట్టునిచ్చావు

చేతికి మేజోడులిచ్చావు

తలకు టోపీలనిచ్చావు

కాళ్ళకు చెప్పులిచ్చావు


వంటికి బట్టలిచ్చావు

కళ్ళకు చూపులిచ్చావు

చెవులకు వినికిడిచ్చావు

తనువుకు స్పర్శనిచ్చావు


అన్నపూర్ణతో అన్నమునిప్పించావు

లక్ష్మిదేవితో డబ్బులనిప్పించావు

వాణీదేవితో విద్యనిప్పించావు

శాంతిసుఖాలు సకలముచేర్చావు


పరమాత్మునికి ప్రణామాలు

దేవడేవునికి ధన్యవాదాలు

పరంధామునికి పాదపూజలు

స్వామివారికి సాష్టాంగనమస్కారాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog