అమ్మా వాగ్దేవీ!
సరస్వతీదేవీ
సహస్ర వందనాలమ్మా!
కామరూపిణీ
కోర్కెలు నెరవేర్చవమ్మా!
వీణను సవరించనీక
వదులయినతీగలు
వ్రేళ్ళతో ముట్టనీక
వినిపించనీయకున్నవి రాగాలు
మూసుకుపోయినకంఠము
మొరాయించి తెరుచుకోక
మౌనమువహించి
మధురంగాపాడకున్నది పాటలు
అలిగిన
అందాలచెలి మోమునుచూచి
అంగిలినుండి
ఆరుబయటకురాకున్నవి మాటలు
కరమునపట్టిన
కలము కదలక
కాగితాలపైన గీయక
కూర్చకున్నది పలుకకున్నది కైతలు
శుభప్రదమైనట్టి
సన్నాయిరాగాన్ని
సన్నుతిచేయటానికి
సహకరించకున్నవి స్వరాలు
చూచిన
చిత్రవిచిత్రదృశ్యాలను
చక్కగా వర్ణించటానికి
చేతాకాకున్నది దొర్లకున్నవి పలుకులు
పాటకు సరియగు
మద్దెలదరువును
వేయటానికి
వణుకుచున్నవి చేతివ్రేళ్ళు
కవిసమ్మేళనంలో
కంఠమెత్తి
కమ్మనికైతను వినిపించటానికి
కుదరకున్నది కవివర్యులకు
అమ్మా పలుకులమ్మా
అనుగ్రహించవమ్మా
అందెళరవళులు మ్రోగించవమ్మా
అపరూపగీతాలు వ్రాసిపాడే అవకాశమివ్వవమ్మా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment