తలపులతట్ట
తట్టిచస్తేగదా
తలపులుపుట్టేది
కవితలువ్రాసేది
తలగోక్కుంటే వస్తాయా?
తనువులు మురిస్తేగదా
తృప్తికలిగేది
తోషాలుపంచేది
నటిస్తే సరిపోతుందా?
మాటలు వదిలితేగదా
మనసులుతెలిసేది
మంచీచెడుతెలిసేది
మౌనంవహిస్తే తెలిసేదెట్లా?
కళ్ళు మూతపడితేగదా
నిద్రవచ్చేది
కలలుకనేది
మేల్కొనియుంటే విశ్రాంతిదొరికేదెలా?
నవ్వితేగదా
మోములువెలిగేది
అందాలుచిందేది
ఏడుస్తుంటే ఎలా?
అడుగులేస్తేగదా
ముందుకుసాగేది
గమ్యముచేరేది
కదలకుంటే ఎట్లా?
అభ్యసిస్తేగదా
ప్రావీణ్యంవచ్చేది
పదవులుదొరికేది
సాధనచేస్తేగదా సఫలమయ్యేది?
నీటిలో దిగితేగదా
ఏటిలోతుతెలిసేది
ఆవలితీరంచేరేది
వెనుదిరిగితే వెనకబడవా?
తింటేగదా
రుచితెలిసేది
కడుపునిండేది
ఊహిస్తే సరిపోతుందా?
ప్రయత్నిస్తేగదా
విజయంపొందేది
పేరువచ్చేది
పాలుమాలితే ఎలా?
విత్తునాటితేగదా
మొక్కమొలిచేది
కాయలు కాచేది
ఊరకుంటే ఫలమేమి?
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment