ఓ చంద్రముఖీ!
చిరునవ్వులు చిందితే
చూచి సంతసించనా!
చక్కని చంద్రవదనానికి
చిత్తయిపోనా!
చూపులు సూటిగావిసిరితే
చిక్కనా దొరకనా!
సూదంటురాయిలా పట్టుకుంటే
చలించక అతుక్కుపోనా!
మల్లెల పరిమళాలుచల్లితే
మత్తులోపడనా!
ముగ్ధమనోహర రూపానికి
మౌలుడిని కానా!
సరసాలాడితే
స్పందించనా!
సమయస్ఫూర్తిని
చూపించనా!
అందంతో ఆకర్షిస్తే
ఆనందం పొందనా!
ఆకాశపు అంచులను
అంటిరానా!
ప్రేమజల్లులు కురిపిస్తే
పరవశించి తడిసిముద్దవనా!
మమతానురాగాలలో
మునిగిపోనా!
అంతరంగాన్ని తడితే
ఆలోచనలలో పడిపోనా!
అందుబాటులోకి వస్తే
అందలం ఎక్కించనా!
చెంతకు వస్తే
చేరదీయనా!
సహధర్మచరణిగాచేసి
సంసారంలోకి దించనా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మౌలుడు= సేవకుడు
Comments
Post a Comment