ఆమె 

(అమలినశృంగారి)


కనబడితే

కళ్ళప్పగిస్తా

స్పందిస్తే

సంబరపడతా


దొరికితే

దోరబుచ్చుకుంటా

వస్తానంటే

వెంటతెచ్చుకుంటా


చిక్కితే

చెంతకుతీసుకుంటా

ప్రక్కనే

అట్టిపెట్టుకుంటా


నక్కితే

వెదికిపట్టుకుంటా

దారికి

తెచ్చుకుంటా


ఏడిస్తే

సముదాయిస్తా

కన్నీరు

తుడిచేస్తా


నవ్వితే

మెచ్చుకుంటా

మదిలో

దాచుకుంటా


ఆడితే

చూస్తా

ఆనందంలో

మునిగిపోతా


పాడితే

దరువేస్తా

శ్రద్ధగా

చెవులునిక్కురిస్తా


తిడితే

తప్పుకుంటా

మరోదారి

చూచుకుంటా


కొడితే

జారుకుంటా

కుక్కినపేనులా

మెదలకుంటా


కోరితే

ఒప్పుకుంటా

జంటకు

తెచ్చుకుంటా


పిలిస్తే

పలుకుతా

సరసాలతో

సల్లాపాలాడతా


ప్రేమిస్తే

పొంగిపోతా

పరువానికి

పగ్గాలేస్తా


ఒప్పుకుంటే 

ఒగ్గేస్తా

సహచరిని

చేసుకుంటా


చెప్పా

ఇక చెప్పా

ఛీ ఛీ

సిగ్గేస్తుంది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog