తస్కరణలపర్వం
తరువులనున్న
తాజా పూలనుండి
తియ్యని తేనెను
తస్కరిస్తున్నాయి తేటులు
తేనెతుట్టెలను తగలబెట్టి
తేనెటీగలను తరిమి
తీపి మధువును
తస్కరిస్తున్నారు స్వార్ధమానవులు
పెరిగిపెద్దయి చెట్లు
కాయలు కాస్తుంటే
తస్కరిస్తున్నారు
పక్షులు పశువులు మనుజులు
దొంగవ్యాపారాలు చేసి
ధనాన్ని పరోక్షంగా
తస్కరించి
దాచుకుంటున్నారు టక్కరివర్తకులు
రెండుచేతుల
రెక్కలకష్టంతో
రాబడిపొందుతున్నవారినుండి
రెట్టంపురేట్లతో పన్నులు వసూలుచేస్తున్నాయి ప్రభుత్వాలు
అమ్యామ్యాలకు అలవాటుపడి
అతిగా అన్యాయంగా
అక్రమంగా గుట్టుగా
అర్జిస్తున్నారు అవినీతిపరులు
అవసరార్ధం అప్పులుజేసేవారినుండి
అధికవడ్డీలు వసూలుచేస్తున్న
ఆస్థిపరులను అనారోగ్యాలు వెంటబడగా
ఆసుపత్రులు అధికఫీజులు రాబడుతున్నాయి
నీటిని జలాశయాలనుండి
తస్కరిస్తున్నా రవినుండి
ఆవిరిని మేఘాలు తస్కరిస్తుంటే
ఆకర్షించి వానచుక్కలను తస్కరిస్తున్నది భూమి
చిక్కిందల్లా
దోచుకొని దాచుకొనే
టక్కరులనుండి
దోపిడీచేస్తున్నారు తస్కరులు
అమలుచేయలేని హామీలనిచ్చి
ఓట్లను డబ్బులిచ్చికొని కొల్లగొట్టి
ఆపై గెలిచినతరువాత అధికారంచెలాయించి
అన్యాయంగా ప్రజలధనాన్ని తస్కరిస్తున్నారు నేతలు
కష్టపడి కూర్చిన
కవిపుంగవుల
కవనాలను భావాలను పదాలను
కాపీలుకొడుతున్నారు కొంతమందికవులు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment