ఎదురుతెన్నులు
వసంతమాసం వస్తుందని
మామిడి చిగురిస్తుందని
ప్రకృతి పులకరిస్తుందని
కోకిలలు కాచుకొనియున్నాయి
చంద్రుడు ఉదయిస్తాడని
వెన్నెల కురిపిస్తాడని
మనసులు మురిపిస్తాడని
ప్రేమికులు వేచియున్నారు
మల్లెలు మొగ్గలుతొడుగుతాయని
మధ్యాహ్నానికి విచ్చుకుంటాయని
పరిమళాలు వెదజల్లుతాయని
భావకులు తలపోస్తున్నారు
వానలు కురుస్తాయని
పంటలు పండుతాయని
ఆదాయం వస్తుందని
రైతులు ఆశపడుతున్నారు
ముగ్గురు ఆడపిల్లలుపుట్టారని
తరువాత కానుపులోనైనా
ఒక మగబిడ్డపుట్టాలని
దంపతులు ఆశపడుతున్నారు
మంచియుద్యోగం వస్తుందని
అధిక ఆదాయంవస్తుందని
కుటుంబాన్ని పోషించుకోవచ్చని
నిరుద్యోగులు తపిస్తున్నారు
మంచిమార్కులు వస్తాయని
ఉన్నతచదువులకు వెళ్ళొచ్చని
జీవితలక్ష్యం చేరవచ్చని
విద్యార్ధులు నిరీక్షిస్తున్నారు
సూర్యోదయం అవుతుందని
తూర్పు తెల్లవారుతుందని
కవితోదయం అవుతుందని
కవులు ఎదురుచూస్తున్నారు
ప్రభాత సమయానికి
మంచికవితలు వస్తాయని
పఠించి పరవశించాలని
పాఠకులు ప్రతీక్షిస్తున్నారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment