తేజరిల్లురా తెలుగోడా!


తెలుగోడా

తేజరిల్లురా!


తెలుగును మెరిపించరా

వెలుగును వ్యాపించరా


ఆంధ్రమును చిలుకరా 

అమృతమును పంచరా


తెనుగును మాట్లాడురా

తేనెచుక్కలను చిందరా


త్రిలింగభాషను తోపించరా 

తిమిరమును తరిమేయుమురా


మాతృభాషను మన్నించుమురా

మనమహనీయులను తలచరా


వరాలతెలుగును వల్లెవేయరా

వయ్యారాలను ఒలకపోయరా


తెలుగుముత్యాలు చల్లరా

తేటదనమును చూపరా


బంగరుతెలుగును బ్రతికించరా

బిడ్డలందరికి బోధించుమురా


తెలుగుతల్లికి ప్రణమిల్లరా

తేటపదాలను పలుకుమురా


ప్రాసపద్యాలు వ్రాయరా

పసందుగా పాడించరా


పలుపాటలను కూర్చరా

పెక్కురాగాలు వినిపించరా


కలమును చేతపట్టరా

కవితలు కుమ్మరించరా


పాత్రలను సృష్టించరా

కథలను చదివించరా


అందాలను వర్ణించరా 

ఆనందము కలిగించరా


పెదాలను కదిలించరా

పాయసాన్ని త్రాగించరా


వాణీదేవిని వేడుకొనుమురా

వీణానాదాలు వెలువరించరా


తోటితెలుగోళ్ళను మురిపించరా

తెలివైనవారని చాటిచెప్పరా


తెలుగుజాతిని కీర్తించరా

తాతముత్తాతల తలచుకోరా


తెలుగును కాపాడరా

తరతరాలు నిలచిపోరా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

tel

Comments

Popular posts from this blog