పాతప్రకాశం పొంకాలు

(ప్రేమికుల పారవశ్యం)


అతడు: చీరాల చేనేతచీరకట్టిన చిన్నదానా

       కొత్తపేట కట్టిన  కొత్తయింటికొస్తావా

       వేటపాలెం వేడిజీడిపప్పు లిస్తానే

       సముద్రపు చేపలపులుసు తినిపిస్తానే


ఆమె:  పాత ప్రకాశంజిల్లా పోరగాడా

       ఒంగోలు గిత్తలాంటి వగలకాడా

       పరువానికి పగ్గాలు వేస్తానులే 

       భారమైన బరువులు మోయిస్తానులే


అతడు: టంగుటూరి సింగారాల బంగారమా

       సింగరాయకొండ సినిమాకు పోదామా

       కరేడు సపోటాలు కొరుక్కుతిందామా

       ఉలవపాదు మామిడికాయలు మింగుదామా


ఆమె:  అద్దంకిసీమలోని యందగాడా

       సింగరకొండ తిరునాళ్ళు చూద్దామా

       భవనాసిచెరువులో బోటెక్కుదామా

       గుండ్లకమ్మ తీరాన గంతులేద్దామా


అతడు: వీరమేడపి గడ్డకు వెళ్ళివద్దామా

       త్రిపురాంతకేశ్వరుని దర్శించుదామా

       దోర్నాలయడవిలో తిరుగుదామా

       నల్లమలయందాలు వీక్షించుదామా


ఆమె:  కంభంచెరువులో మునుగుదామా

       గిద్దలూరుబత్తాయీలు తిందామా

       కనిగిరి కొండయెక్కి ఆడదామా

       పామూరు పొలాల్లో పాడదామా


అతడు: పొదిలిపట్టణానికి పోయివద్దామా

       దర్శివెళ్ళి కాలువలపక్క తిరుగుదామా 

       చీమకుర్తి బండలగనులు చూద్దామా

       సంతనూతలపాడులో సంబరాలు చేద్దామా


ఆమె:  కడవకుదురులో కలుసుకుందామా

       ఇంకొల్లువెళ్ళి విరగతీద్దామా

       పర్చూరువెళ్ళి పరవశిద్దామా

       మార్టురువెళ్ళి మురిసిపోదామా


అతడు: చేయీచేయీ కలుపుకుందామా

       పాతప్రకాశంజిల్లా పరికిద్దామా

       చదలవాడ రాఘవుడిని చూచివద్దామా

       మార్కాపురం చెన్నకేశవునికి మొక్కుదామా


ఆమె:  రామాయపట్నంలో మునుగుదామా

       తెట్టుగ్రామములో తేలుదామా

       కొత్తపట్నంలో కులుకుదామా

       ఓడరేవులో విహరించుదామా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


గత నాలుగు నెలలుగా ప్రకాశంజిల్లా ముఖ్యపట్టణం ఒంగోలులో ఉన్నాను. నేడు తిరిగి హైదరాబాదు వెళ్తున్నాను. ఈ సందర్భముగా పాత ప్రకాశం జిల్లా పొంకాల కవితను వ్రాశాను. మీరు చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.



Comments

Popular posts from this blog