సమాజరంగం
సమాజం
ఒకరంగస్థలం
మనమమందరం
పాత్రధారులం
చురుకైనపాత్రను
పోషించి
జనాన్ని
జాగృతంచేయాలనుకుంటున్నా
విలువైనపాత్రలో
నటించి
వీక్షకులను
మెప్పించాలనుకుంటున్నా
సహజమైనపాత్రలో
కనిపించి
సహచరులను
చైతన్యపరచాలనుకుంటున్నా
బరువైనపాత్రను
ధరించి
బాధ్యతలను
గుర్తుచేయాలనుకుంటున్నా
సంస్కర్తపాత్రలో
ఒదిగిపోయి
మూఢనమ్మకాలను
నిర్మూలించాలనుకుంటున్నా
అందమైనపాత్రలో
అగుపించి
ఆనందాలను
అందించాలనుకుంటున్నా
ప్రేమికుడిపాత్రలో
మునిగిపోయి
ప్రజాహృదయాలను
దోచుకోవాలనుకుంటున్నా
రాజకీయనాయకుడిపాత్రలో
వసించి
రామరాజ్యాన్ని
తలపించాలనుకుంటున్నా
సేవకుడిపాత్రలో
లీనమైపోయి
సుఖసంతోషాలను
చేకూర్చాలనుకుంటున్నా
సున్నితమైనపాత్రను
తీసుకొని
సహృదయులను
సంతృప్తిపరచాలనుకుంటున్నా
విశిష్టమైనపాత్రలో
నిమగ్నమై
మానవతావిలువలను
చాటాలనుకుంటున్నా
కవిపాత్రలో
కనిపించి
కమ్మనికవితలను
కంఠస్థంచేయించాలనుకుంటున్నా
మీ పాత్రను
మీరే రచించుకోండి
మీ మనసును
మీరే తెలియజేయండి
మంచిపాత్రను
మీరే ఎన్నుకోండి
చక్కనిసందేశాలను
సమాజానికి చేర్చండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment