కలం పలుకులు
(కలం ఉవాచ)
కవులారా
నన్ను పట్టుకోండి
ఉహలు ఊరింపచేస్తా
విషయాలు వెల్లడింపజేస్తా
కవులారా
నన్ను చేతపట్టండి
అక్షరాలు చెక్కుతా
పదాలను కల్పుతా
కవులారా
నన్ను చూడండి
నీరులా ప్రవహిస్తా
గాలిలా వ్యాపిస్తా
కవులారా
నన్ను వాడండి
అందాలను వర్ణిస్తా
ఆనందము కలిగిస్తా
కవులారా
నన్ను అడగండి
ప్రాసలు పేర్చుతా
లయలు కూర్చుతా
కవులారా
నన్ను చేకొనండి
పూలను చూపితా
పరిమళాలు చల్లిస్తా
కవులారా
నన్ను కోరండి
నవ్వులు చిందిస్తా
మోములు వెలిగిస్తా
కవులారా
నన్ను తలచండి
కలలోకి వస్తా
కథావస్తువు నిస్తా
కవులారా
నన్ను తీసుకోండి
కవనం చేయిస్తా
కవితలు వ్రాయిస్తా
కవులారా
నన్ను మెచ్చండి
పొగడ్తల నిప్పిస్తా
సన్మానాలు చేయిస్తా
కవులారా
ఇవి చాలంటారా
ఇంకేమయినా
కావాలంటారా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కలము
కరదీపిక
నగవు
ముఖదీపిక
కలము
విష్ణువు చక్రము
శివుని త్రిశూలము
వాగ్దేవి ఘంటము
కలము
రైతుల నాగలి
శ్రామికుల కొడవలి
మహిళల చేతిగంటి
కలము
చేతులకెక్కేది
పుటలపైగీసేది
భావాలకురూపమిచ్చేది
కలము
పద్యాలు వ్రాయించేది
గద్యాలు రచయింపజేసేది
వచనకవితలు ఒలుకించేది
కలము
సరస్వతీదేవి ఆయుధము
సాహిత్యక్రియల సాధనము
కవివర్యుల కరభూషణము
Comments
Post a Comment