రవికన్నా కవిమిన్న
(కవిగారి కాంక్షలు)
కలంపడితే
కమ్మనికవితలు ఉరకాలి
కాగితంపట్టుకుంటే
కవితలు జారువాలాలి
కలగంటే
కాల్పనికకైతలు కూర్చగలగాలి
పట్టిందల్లా
బంగారం కావాలి
కోరితే
కొండమీదకోతైనా దిగిరావాలి
నవ్వితే
నవరత్నాలు రాలాలి
పిలిస్తే
పరుగెత్తుకుంటూ రావాలి
పాడితే
పరవశపరచకలగాలి
మనసుపెడితే
మార్గాలుకనుగొనగలగాలి
ప్రయత్నిస్తే
ఫలితం దక్కించుకోవాలి
ప్రేలిస్తే
గురిచేరాలి
రాసిందెల్లా
రమ్యంగా ఉండాలి
పంపిందెల్లా
పత్రికల్లో రావాలి
పఠించినవారెల్లా
ప్రశంసించేటట్లు ఉండాలి
పోటీలకుపంపినకవితలకెల్లా
పతకాలు పొందాలి
పేరుప్రఖ్యాతులు
ప్రపంచమంతా విస్తరించాలి
కవనలోకంలో
కలకాలం నిలిచిపోవాలి
కవియంటే
రవికన్నా మిన్నయనాలి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment