ఏడి? వారేడి?
(అలిగినవేళ)
వారొస్తే
బుంగమూతిపెదతా
బెట్టుచేస్తా
బ్రతిమాలించుకుంటా......
పొద్దుకూకింది
చీకటిపడింది
సద్దుమణిగింది
ఏరి? వారేరి?
ప్రియుడురాలేదు
పలకరించలేదు
పరిహాసాలాడలేదు
ఏడి? వాడేడి?
చంద్రుడొచ్చాడు
చుట్టూతారకలున్నవి
చతుర్లాడుతున్నట్లున్నది
రారేమి? వారింకారారేమి?
వెన్నెలకాస్తున్నది
చల్లదనమున్నది
చక్కదనమున్నది
ఎక్కడ? వారెక్కడ?
తోటనిండాపూలున్నవి
పరిమళాలుచల్లుతున్నవి
ప్రేమనురేకెత్తుస్తున్నాయి
జాడేది? వారి జాడేది?
తలలోమల్లెలువాడుతున్నవి
సమయంగడుస్తున్నది
మనసుతొందరపెడుతున్నది
రారేమి? వారురారేమి?
తాళలేకున్నా
వేచిచూడలేకున్నా
లేస్తున్నా
ఇంటికివెళ్తున్నా.......
రేపైనా
వస్తారో రారో?
ఏమైందో ఏమో?
అలిగారో ఏమో?
చూస్తా వేచిచూస్తా
అందాకా
విరహతాపంతో
వేగిపోతా........
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment