ఓ మనిషీ!


మేనుకంటిన మలినమును

మానవత్వముతో కడగరా

మనసుకంటిన మురికిని

మంచితనముతో తుడవరా


కాయానికంటిన కంపును

కుసుమగంధాలతో కడతేర్చరా

కుళ్ళిపోయిన దేహమును

నిజాయితీతో ప్రక్షాలనముచెయ్యరా


పాసిపట్టిన పళ్ళను

పకపకానవ్వులతో పరిశుభ్రముచెయ్యరా

గుబిలిపట్టిన చెవులను

శ్రావ్యరాగాలతో శుద్ధముచెయ్యరా


ధూళితో మూసుకున్నకళ్ళను

అందచందాలుచూపి తెరిపించరా

మూసుకుపోయిన ముక్కును

సువాసనలతో శుచిపరచరా


వెక్కిరిస్తున్న నుదురుకు

మెచ్చుకొనుటను నేర్పరా

వెలవెలలాడుతున్న మోమును

చిరునవ్వులతో వెలిగించరా


రుచికోల్పోయిన నాలుకకు

తేనెపలుకులను తడపరా 

మూతిబిగించిన పెదవులకు

అక్షరామృతము అందించరా


చేతలుడిగిన చేతులను

చైతన్య పరచరా

కదలనీమెదలనీ కాళ్ళను

కవ్వించి నృత్యమాడించరా


మాసినా కురులకు

మర్ధనము చెయ్యరా

తట్టినా తలపులను

తెల్లకాగితాలపై పెట్టరా


గాఢ నిద్రానుండి

గబగబాలేవరా

మత్తునూ వదిలేసి

మిసమిసాలాడరా


సూర్యుడిని చూడరా

కళకళాలాడరా

చంద్రుడిని చూడరా

ముసిముసీనవ్వరా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog