ఊహల గుసగుసలు
ఊహలు ఊరుతున్నాయి
ఉరకలు వేయిస్తున్నాయి
ఆలోచనలు పారుతున్నాయి
అంతరంగాన్ని ఆడిస్తున్నాయి
తలపులు తడుతున్నాయి
తలలో తందనాలాడుతున్నాయి
యోచనలు వెంటబడుతున్నాయి
హృదయాన్ని ఊగిసలాడిస్తున్నాయి
చింతనలు చాలాపుడుతున్నాయి
చిత్తాన్ని చంచలంచేస్తున్నాయి
విచారణలు వంటిలోకొస్తున్నాయి
వర్ణనలను విరివిగాచేయమంటున్నాయి
భావాలు బయటకొస్తున్నాయి
బేషుగ్గా బోధించమంటున్నాయి
కల్పనలు కడుతోస్తున్నాయి
కమ్మనికవితలుగా మలచమంటున్నాయి
కలలు కోకొల్లలువస్తున్నాయి
కవ్వించి కవనంచేయమంటున్నాయి
అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి
అందంగా వ్యక్తపరచమంటున్నాయి
అనుభవాలు కలుగుతున్నాయి
ఆనందాలను అందించమంటున్నాయి
చిత్తం చలిస్తుంది
చక్కనికవితలు సృష్టించమంటుంది
మనసు మారముచేస్తున్నది
మననం మరోమారుచేసుకోమంటున్నది
మది బయటకొస్తానంటుంది
మనసులను మురిపిస్తానంటుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment