నవమన్మధుడా!


మన్మధా!

మత్తుచల్లకురా

మనసుదోచకురా

మరులుకొలపకురా!


చిన్నదానినిరా

శిరసునెత్తి చూడలేనిదానినిరా

సంభాషణలు చేయలేనిదానిరా

సరసాలు తెలియనిదానినిరా


మల్లెపూలు పెట్టుకోనా

మంచిగంధం రాసుకోనా

సుమసౌరభాలు చల్లనా

సోయగాలు చూపించనా


చిరునవ్వులు చిందనా

చెంతకు రమ్మందునా

చతురోక్తులు విసరనా

చిత్తాన్ని చిత్తుచెయ్యనా


షోకులు చేసుకోనా

చూపులు కలపనా

చిలిపిచేష్ఠలు చెయ్యనా

సూదంటురాయిలా చెంతకులాగుకోనా


ప్రేమలేఖ పంపనా

పరవశింపజేయనా

తోడుకు రమ్మందునా

జోడును చేసుకుందునా


వెన్నెలలో విహరించనా

వెండిమబ్బులక్రింద కూర్చొననా

వినోదపరచనా వేదుకచెయ్యనా

విరులువిసరనా విందుకుపిలవనా


తలపులు తడుతున్నాయి

వలపులో దించుతున్నాయి

విరహం వేధిస్తుంది

వెచ్చదనం కావాలంటుంది


ముచ్చట లాడాలనియున్నది

మాటలు కలపాలనియున్నది

మనసు మొండికేస్తున్నది

మతిపోతున్నది గతితప్పుచున్నది


మన్మధా! బాణాలు విసరకు

మదిలో భావాలురేకెత్తించకు

మరులుకొలపకు మోహంలోదించకు

మత్తుచల్లకు చిత్తాన్నిచలింపకు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog