తెలుగునిగ్గులు


తెలుగు మనదిరా 

వెలుగు మనదిరా

నిగ్గు మనదిరా 

నెగ్గు మనదిరా


తెలుగుజాతి మనదిరా 

తెలుగుఖ్యాతి మనదిరా

అక్షరాలు ఆణిముత్యాలురా 

పలుకులు పనసతొనలురా


తెలుగుదనము చాటరా

తెలుగుకాంతులు చల్లరా

తెలుగుసొగసులు చూపరా

తెలుగుమదులను తట్టరా


తెలుగుబాట నడవరా

తెలుగుతోట పెంచరా

తెలుగుమాట పలుకరా

తెలుగుపాట పాడరా


తెలుగుపద్యాలు కూర్చరా

తెలుగుకవితలు పేర్చరా

తెలుగుగేయాలు వ్రాయరా

తెలుగుకథలను చెప్పరా


తెలుగుసేద్యము చెయ్యరా

తెలుగుపంటలు పండించరా

తెలుగుపూలను పూయించరా

తెలుగుపరిమళాలు చల్లరా


తెలుగునాట తిరుగరా

తెలుగువాళ్ళ కలవరా

తెలుగుఘనత చాటరా

తెలుగుచరిత్ర తెలుపరా


తెలుగును మరుగుచేయకురా

తెలుగును అటకెక్కించకురా

తెలుగును ప్రోత్సహించరా

తెలుగుకు ప్రాచుర్యమివ్వరా


తెలుగుతెరువన నడవరా

తెలుగుజ్యోతులు వెలిగించరా

తెలుగుసభలు నిర్వహించరా

తెలుగుఘనుల పరిచయంచెయ్యరా


సత్కవులను స్వాగతించరా

సమ్మేళనములు పెట్టరా

శాలువాలు కప్పరా

సన్మానములు చెయ్యరా


తెలుగుఫలములు మనవిరా

తెలుగుపుష్పాలు మనవిరా

తెలుగుసౌరభాలు మనవిరా

తెలుగుతియ్యదనాలు మనవిరా


తెలుగంటే వెలుగనీ

తెలుగుభాష గొప్పనీ

దేశవిదేశాల చాటరా

విశ్వవ్యాప్తము చెయ్యరా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog