మనసు తహతహలు
మనసు
రూపాన్ని పొంది
వేషాన్ని ధరించి
లోకాన్ని పాలించాలంటున్నది
మనసు
పంజరంనుండి
బయటకొచ్చి
పక్షిలా విహరించాలంటున్నది
మనసు
చీకటిగుహనుండి
తప్పించుకొనివచ్చి
దీపంలా వెలిగిపోవాలంటున్నది
మనసు
బంధాలనుతెంచుకొని
బాహ్యజగంలోనికొచ్చి
స్వేచ్ఛగా సంచరించాలంటున్నది
మనసు
పువ్వులాతయారయి
పలువురికంటబడి
పరిమళాలు చల్లాలంటున్నది
మనసు
కట్టలుతెంచుకొని
ఉరుకులనందుకొని
నదిలా ప్రవహించాలంటున్నది
మనసు
మట్టిలోనాటుకొని
మొక్కలామొలిచి
మహావృక్షంలా ఎదగాలంటున్నది
మనసు
రెక్కలనుతొడుక్కొని
రెపరెపాలాడించి
అకాశం అంచులదాకావెళ్ళిరావాలంటున్నది
మనసు
నల్లనిమబ్బయి
నింగినిచేరి
ఆలోచనాజల్లులు కురిపించాలంటున్నది
మనసు
ధైర్యంకూడగట్టుకొని
ధరిత్రిలోతిరిగి
సాహసాలు చెయ్యాలంటున్నది
మనసు
ముస్తాబయి
ముందుకొచ్చి
మాటలతో మురిపించాలంటున్నది
మనసు
అక్షరాలను ఏరి
అందంగా అమర్చి
అందరినిచదివించి ఆహ్లాదపరచాలంటున్నది
మనసు
మనుషులను వదిలిపెట్టి
ముసుగును తొలగించుకొని
మహిలో మహోన్నంతంగాజీవించాలంటున్నది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment