పడ్డానండి ప్రేమలో
(టానిక్కు దొరికింది)
పూదోటకు వెళ్ళా
పూలను పరికించా
పొంకాలు ఆస్వాదించా
పరిమళాలు పీల్చా
పూలకవితను కూర్చా
పలువురికి వినిపించా
అయినా
సంతసం కలగలా
ప్రకృతిని కాంచా
పుడమితల్లికి మొక్కా
జాబిలిని చూశా
వెన్నెలలో విహరించా
తారకలను దర్శించా
ఊహలలో తేలిపోయా
అయినా
తనివి తీరలా
సభకు వెళ్ళా
స్టేజీని ఎక్కా
గొంతును విప్పా
గానం చేశా
శాలువా కప్పించుకున్నా
సన్మానం పొందా
అయినా
ఆనందం చిక్కలా
కలమును పట్టా
కాగితాలు నింపా
అక్షరాలు అల్లా
పదాలు పారించా
కవితను వ్రాశా
కమ్మగా ఆలపించా
అయినా
ఆహ్లాదం అందలా
చెలిచెంతకు వెళ్ళా
కబుర్లు చెప్పా
సరసాలు ఆడా
సమయం గడపా
మదిని విప్పా
మాటను తీసుకున్నా
అయినా
ఆత్మ తృప్తిపడలా
నిన్న
పెక్కుఫోనులు వచ్చాయి
ప్రశంసలు కురిసాయి
చాలా సమూహాలలో
సుస్పందనలు కనిపించాయి
సంతృప్తిని కలిగించాయి
ఇప్పుడు టానిక్ దొరికింది
మది పొంగిపొర్లింది
పడ్డానండి ప్రేమలో
కవిత్వము మోజులో
కవిత కవ్వింపులతో
దిగానండి కవనరంగంలో
సాహిత్య సంసారంలో
సాహితీ మార్గంలో
పాఠకుల ప్రేరణతో
సరస్వతీ దీవెనలతో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment