వాణీదేవికి వందనాలు


ఉల్లమున నిలిచి

ఊహలను లేపి

ఉత్సాహము నిచ్చి

ఉరకలేయిస్తున్న వాణీదేవికి వందనాలు


కలమును పట్టించి

కాగితాలు నింపించి

కమ్మదనము చూపించి

కవనముచేయిస్తున్న పలుకులమ్మకి వందనాలు 


విషయాలు యిచ్చి 

వర్ణనలు చేయించి

వినోదము కలిగించి

వేడుకచేయమంటున్న చదువులతల్లికి వందనాలు 


చెవులకు వినిపించి

మనసును మళ్ళించి

భావాలను పొంగించి

చేతినికదిలిస్తున్న వాగ్దేవికి వందనాలు


తేనెచుక్కలు చిందించి

సుగంధాలు చల్లి

కడుపును నింపి

కవిత్వమునల్లిస్తున్న గీర్వాణికి వందనాలు 


పలుకులు శోభిల్లపరచి

వ్రాతలు రుచింపజేసి

అందాలను చూపించి

ఆనందపరుస్తున్న శారదాదేవికి వందనాలు


ఆశలు కలిగించి

ఆశయాల నేర్పరచి

అనుభూతులు పంచి

ఆలోచనలుపారిస్తున్న నలువరాణికి వందనాలు


కలలోకి వచ్చి

కవ్వించి పోయి

అక్షరాలు దొర్లించి

కవితలుకూర్పిస్తున్న విద్యాదేవికి వందనాలు


కాంతులు ప్రసరించి

వెన్నెల కురిపించి

మలయమారుతాన్ని వీచి

సుధనుత్రాగిస్తున్న భారతీదేవికి వందనాలు


ఆ అంతరంగశక్తికి

ఆ అక్షరదైవానికి

ఆ అమృతమూర్తికి

ఆ అమ్మసరస్వతికి వందనాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog