నాలుగు మాటలు
నాలుగు పంక్తులు
కాగితంపై పెట్టాలనియున్నది
నలుగురితో
చదివించి చూడాలనియున్నది
నాలుగు మాటలు
చెప్పాలనివున్నది
నా ఆలోచనలు
బయటపెట్టాలనివున్నది
నలుగురితో
మాట్లాడాలని ఉన్నది
నామదిని
తెలపాలని ఉన్నది
నాలుగు విషయాలు
ప్రస్తావించాలని వున్నది
నా శ్రోతలను
సంబరపరచాలని వున్నది
నలుగురిని
నవ్వించాలని యున్నది
నాలుకలపై
నానాలని యున్నది
నలుగురితో
ఆడాలని ఉన్నది
నాపసేమిటో
చాటాలని ఉన్నది
నలుగురితో
బాగుండాలని వున్నది
నేను ప్రాణంవిడిచినపుడు
మోయించాలని వున్నది
నాలుగు పాటలు
పాడాలని ఉన్నది
గాయకుడిగా ప్రఖ్యాతిని
పొందాలని ఉన్నది
నాలుగు ముక్కలు
వాగాలని యున్నది
ఏమాత్రము నసలేకుండా
చూడాలని యున్నది
నాలుగు నిమిషాలు
ఉపన్యసించాలని వున్నది
సభాసదులను
సంతోషపరచాలని వున్నది
నాలుగు సభలలో
పాల్గొనాలని ఉన్నది
నా నాలుకదూలను
తీర్చుకోవాలని ఉన్నది
నలుగురితో
నారాయణ అనాలనియున్నది
అందరి బాటలో
నడక సాగించాలనియున్నది
నాలుగు కవితలు
వ్రాయాలని ఉన్నది
మంచికవిగా
గుర్తింపుతెచ్చుకోవాలని ఉన్నది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment