అక్షరవిన్యాసాలు
చెలమలో
ఊటలూరుతున్నాయి
శిరములో
ఊహలుపుడుతున్నాయి
నదిలో
నీరు ప్రవహిస్తున్నది
మదిలో
పదాలు పారుతున్నాయి
కడలిలో
అలలు ఎగిసిపడుతున్నాయి
మనసులో
విషయాలు పెల్లుబుకుతున్నాయి
పక్షులు
కిలకిలలాడుతున్నాయి
ప్రాసలు
దడదడపొసుగుతున్నాయి
ఆకాశంలో
కాంతికిరణాలు ప్రకాశిస్తున్నాయి
కాగితాలలో
అక్షరకాంతులు వెలుగుతున్నాయి
పూదోటలో
పరిమళాలు ప్రసరిస్తున్నాయి
పుటలలో
కవితాసౌరభాలు వీస్తున్నాయి
పూసలు
మాలలుగా గుచ్చబడుతున్నాయి
అక్షరాలు
కయితలుగా పేర్చబడుతున్నాయి
తుమ్మెదలు
తేనెను సేకరిస్తున్నాయి
పాఠకులు
కవితలను ఆస్వాదిస్తున్నారు
మబ్బులు
చినుకులు చల్లుతున్నాయి
కైతలు
మాధుర్యాలు చిమ్ముతున్నాయి
వాణి వీణానాదం
వినండి
కవి కవితాగానం
ఆలకించండి
అక్షరవిన్యాసాలను
పరికించండి
సాహిత్యప్రక్రియలను
ప్రోత్సహించండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment