ఓరేయి
ఊహపుట్టింది
తలనుతట్టింది
భావమయ్యింది
కాగితమెక్కింది
కోరికొకటి కలిగింది
రంగంలోకి దింపింది
సాధన చేయించింది
విజయం చేకూర్చింది
అందము అగుపించింది
కళ్ళను కట్టిపడవేసింది
అనందము నిచ్చింది
మనసును దోచింది
పువ్వులు కనబడ్డాయి
పరిమళాలు చల్లాయి
పొంకాలు చూపాయి
పసందు నిచ్చాయి
జాబిలి ఉదయించాడు
వెన్నెలను కురిపించాడు
ప్రేమను వెదజల్లాడు
ప్రేమికులను రెచ్చగొట్టాడు
తారకలు వచ్చాయి
తళతళ వెలిగాయి
మేఘాలు లేచాయి
చినుకులు చల్లాయి
సూరీడు ఉదయించాడు
కాంతులు కుమ్మరించాడు
చీకటిని పారదోలాడు
జనాన్ని జాగృతంచేశాడు
అక్షరాలు అందాయి
పదాలు పేరుకున్నాయి
పంక్తులు పొసగాయి
కవితలు కూరాయి
పక్షులు లేచాయి
రెక్కలు విప్పాయి
కిలకిల లాడాయి
గాలిలో ఎగిరాయి
కవులు చూచారు
సంబర పడ్డారు
కలమును పట్టారు
కవితలు కూర్చారు
చూచింది
చూచినట్టుగా చెప్పా
జరిగింది
జరిగినట్టుగా వ్రాశా
చదివింది
చక్కగా చెబుతారా
తట్టింది
తడమకుండా తెలుపుతారా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment