కవనకుసుమాలు
కలం పట్టుకోమంటుంటే
కాగితం ముందుకొస్తుంటే
క్షరరహితాలు దొర్లుతుంటే
కవిత పుట్టకుండుంటుందా!
ఆలోచనలు తడుతుంటే
భావాలు భ్రమిస్తుంటే
పదాలు పారుతుంటే
కైత పుటకెక్కకుంటుందా!
అందాలు కనబడుతుంటే
ఆనందం కలుగుతుంటే
అనుభూతులు అలరిస్తుంటే
అద్భుతకయితలు ఆవిర్భవించవా!
చదువరులు అడుగుతుంటే
పాఠకులు పరవశిస్తుంటే
సాహిత్యలోకం సంబరపడుతుంటే
సుకవనాలు బయటకురావా!
వాట్సప్పు ఎదురుచూస్తుంటే
ఫేసుబుక్కు పంపమంటుంటే
మెస్సంజరు మెస్మరైజుచేస్తుంటే
చక్కనికవిత్వం వెలుగులోనికిరాదా!
పూలకవివని పొగుడుతుంటే
కవిరాజువని పిలుస్తుంటే
భావకవివని ప్రోత్సహిస్తుంటే
విన్నూతనకవిత వెలువడదా!
పూలు పొంకాలుచూపుతుంటే
జాబిల్లి వెన్నెలకాస్తుంటే
కోకిలలు గానంచేస్తుంటే
కవిగారివర్ణనలు పులకించవా!
విరులు విచ్చుకుంటుంటే
సుమాలు సౌరభాలుచల్లుతుంటే
తుమ్మెదలు ఝంకారాలుచేస్తుంటే
పూలకవితలు పుట్టకరావా!
మన్మధుడు శరాలుసంధిస్తుంటే
వానదేవుదు చినుకులుకురిపిస్తుంటే
వాయుదేవుదు చల్లనిగాలివీస్తుంటే
కవిబ్రహ్మ కవితలుసృష్టించడా!
సాహితి వెన్నుతడుతుంటే
మది మురిసిపోతుంటే
వాణీదేవి వరాలిస్తుంటే
కమ్మనికవితలు ప్రవహించవా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment