నవ్వులు పువ్వులు
నవ్వవు పక్షులు
ఎప్పుడున్
విప్పును రెక్కలు
ఎగురుటకున్
వెదకును గింజలు
తినుటకున్
పెట్టును కూతలు
నిత్యమున్
నవ్వుట ఎరుగవు
జంతువుల్
నాలుగు కాళ్ళన
నడచున్
గడ్డీ గాదములను
మేయున్
అరుచును మూతులు
తెరచిన్
నవ్వులు చిందవు
వృక్షముల్
పచ్చని ఆకులు
తొడుగున్
ఋతువుల కాయలు
కాయున్
ప్రకృతి కిచ్చును
సొగసుల్
నవ్వుల పువ్వులు
కురిపించున్
ఇచ్చును చూపరులకు
మోదముల్
వీక్షకులకు పొంకాలు
చూపున్
వికసించి పరిమళాలు
వీచున్
నరుడొక్కడె నవ్వును
లోకమునన్
చిమ్మును వెలుగులు
మోములన్
మురిపించు మనుజల
మనసులన్
గ్రక్కును సుధలు
బయటికిన్
పిల్లల నవ్వులు
పరవశపరచున్
పడతుల నవ్వులు
అందమునిచ్చున్
పురుషుల నవ్వులు
ప్రమోదంతెలుపున్
పెద్దల నవ్వులు
కుశలంతెలుపున్
కొన్ని నవ్వులు
చిత్తసూచనల్
కొన్ని నవ్వులు
వలపుగాలముల్
కొన్ని నవ్వులు
నాటకముల్
కొన్ని నవ్వులు
వ్యాధినిరోధకముల్
నవ్వులే
సంపదల్
నవ్వులే
రత్నముల్
నవ్వులే
వెలుగుల్
నవ్వులే
జీవితముల్
ఒకప్పుడు
నవ్వు నాలుగురకాల చేటు
ఇప్పుడు
నవ్వు నలుబదివిధాల మేలు
పకపకా నవ్వండి
పల్లుబయట పెట్టండి
అందాలను చూపండి
ఆనందముగా ఉండండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment