గులాబీల గుబాళింపులు


అదిగో

గులాబీమొక్క

అవిగో

రోజాపూలు

అల్లవిగో

కుబ్జకమొగ్గలు


పూలేమో

పిలుస్తున్నాయి

మొగ్గలేమో

ముకుళిస్తున్నాయి


నేటి విత్తనము

రేపటి అంకురము

నేటి మొగ్గలు

రేపటి విరులు


ఒక రోజామొక్క

రెండు కొమ్మలు

మూడు పువ్వులు

నాలుగు మొగ్గలు

రెపెరెపలాడుతున్నాయి


మూడు గులాబీలు

ముచ్చటపరుస్తున్నాయి

నాలుగు రోజామొగ్గలు

తొంగితొంగి చూస్తున్నాయి


విరిసిన పూలు

గుబాళిస్తున్నాయి

అందాలను

ఆరబోస్తున్నాయి


కళ్ళను

కట్టేస్తున్నాయి

చూపును

లాగేస్తున్నాయి


ఆకుపచ్చని ఆకులు

విచ్చుకోని మొగ్గలు

వికసించిన పుష్పాలు

దోచుకుంటున్నాయి మదులు


అలరులు

ఆకర్షిస్తున్నాయి

ఆర్తవాలు

ఆకట్టుకుంటున్నాయి

అరవిరులు

అదునుకోసంచూస్తున్నాయి


ఓ గులాబీ

చూపువిసిరింది

ఓ గులాబీ

ముల్లుగుచ్చింది

ఓ గులాబీ

సిగ్గుపడుతుంది


గులాబీలు

కవ్వించుతున్నాయి

కలమునుపట్టిస్తున్నాయి

కవితనువ్రాయిస్తున్నాయి


కమ్మనికవిత్వం

కూర్చా

అద్భుతకవనం

అల్లా


గులాబీకవితను

చదవండి

గుండెలపైపన్నీరును

చల్లుకోండి


పూలమనసుని

తెలుసుకోండి

పూలకవిని

తలుచుకోండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog