మొగ్గ


మొగ్గ తొడిగింది

తల్లి మురిసింది


గాలి వీచింది

మొగ్గ వణికింది


ఎండ తగిలింది

మొగ్గ కంపించింది


తుమ్మెద చేరింది

మొగ్గ భయపడింది


తల్లి చూచింది

ఆకులలో కప్పింది


తుమ్మెదచేష్ఠలు కన్నది

సిగ్గుపడి తలదించుకున్నది


లోకాన్ని చూచింది

మొగ్గ మెచ్చింది


ఆకులచూచింది

ఆశ్చర్యపోయింది


పూలను చూచింది

పరవశించిపోయింది


తోటిమొగ్గలను చూచింది

సంతోషపడిపోయింది


వాలినపూలను చూచింది

తల్లడిల్లిపోయింది


రాలినపూలను చూచింది

విలవిలలాడింది


ఆకాశాన్ని చూచింది

ఆనందపడింది


మేఘాలను చూచింది

ముచ్చటపడింది


పక్షులను చూచింది

పులకరించిపోయింది


పిల్లలను చూచింది

పొంగిపోయింది


మహిళలను చూచింది

ముగ్ధురాలయ్యింది


కవిని చూచింది

కలవరించింది


కలలోకి వచ్చింది

కవితను వ్రాయమంది


కవి కనికరించాడు

కవితనొకటి వ్రాశాడు


విరబూయమన్నాడు

విరజిమ్మమన్నాడు


ఆశీర్వదించాడు

ఆలోచనలులేపాడు


మొగ్గ మొక్కింది

తల్లి తృప్తిపడింది


కవిత పుటలకెక్కింది

మొగ్గ ధన్యురాలయ్యింది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog