పూలపరువాలు
ఉదయం
పూలలో బాల్యం చూస్తున్నా
మధ్యాహ్నం
పూలలో కౌమారం కాంచుతున్నా
మధ్యాహ్నం
పూలలో యవ్వనం వీక్షిస్తున్నా
రాతిరి
పూలలో వృద్ధాప్యం దర్శిస్తున్నా
ఉదయం
పూలలో పసిపాపలను చూస్తున్నా
మధ్యాహ్నం
పూలలో పడుచులను కాంచుతున్నా
సాయంత్రం
పూలలో పెళ్ళయినపడతులను వీక్షిస్తున్నా
రాతిరి
పూలలో ప్రణయప్రలాపనలకాంతలను దర్శిస్తున్నా
ఉదయం
పూలలో సిగ్గులు చూస్తున్నా
మధ్యాహ్నం
పూలలో మిడిసిపాటు కాంచుతున్నా
సాయంత్రం
పూలలో ప్రేమానురాగాలు వీక్షిస్తున్నా
రాతిరి
పూలలో రసికత్వం దర్శిస్తున్నా
పువ్వులు పూస్తున్నాయి
పొంకాలు ప్రదర్శిస్తున్నాయి
పలురంగులు పరికింపచేస్తున్నాయి
ప్రమోదాలు పంచుతున్నాయి
పువ్వులు పరిమళాలుచల్లుతున్నాయి
పరమానందపరుస్తున్నాయి
ప్రకాశిస్తున్నాయి
పరవశమిస్తున్నాయి
పువ్వులు పరమాత్ముని పాదాలుచేరుతున్నాయి
పుణ్యప్రదమవుతున్నాయి
పడతులకొప్పులెక్కుతున్నాయి
ప్రలోభానికిగురిచేస్తున్నాయి
పువ్వులు మొగ్గలుతొడుగుతున్నాయి
సిగ్గులు చూపుతున్నాయి
విరబూస్తున్నాయి
మరులుకొలుపుతున్నాయి
పువ్వులు వికసిస్తున్నాయి
విందులిస్తున్నాయి
పడకెక్కుతున్నాయి
పరవశపరుస్తున్నాయి
పువ్వులు వాడిపోతున్నాయి
వ్రాలిపోతున్నాయి
రాలిపోతున్నాయి
జాలిపొందుతున్నాయి
పూలవనం వెళ్ళు
పూలలోకం చూడు
ప్రకృతిసోయగాలు కాంచు
పూలకవితలు ఆస్వాదించు
పూలతోటమాలిని నేను
పూలాభిమానిని నేను
పూలప్రేమికుడను నేను
పూలకవిని నేను
పాఠకులారా
పూలను తలచుకోండి
పూలకవితలు చదవండి
పూలకవిని గుర్తుంచుకోండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment