ప్రబోధపర్వము


ఎవరేమిచెప్పినా

తప్పకవినరా

నిజముతెలుసుకొనినడుచుకోరా!


మీసమున్నదని

మెలియవేస్తే

కత్తిరిస్తారురా!


మొనగాడినని

గర్వపడితే

పడదోస్తారురా!


అందమున్నదని

విర్రవీగితే

అగచాట్లుపెడతారురా!


డబ్బుకలదని

తగలవేస్తే

అడుక్కోకతప్పదురా!


అధికారమున్నదని

చలాయిస్తే

అణచివేస్తారురా!


ఓటుహక్కున్నదని

దుర్వినియోగంచేస్తే

సమాజానికిచేటురా!


తెలివియున్నదని

తోకజాడిస్తే

తంటాలుపాలవుదురా!


మనసుపడ్డావని

అడ్డదారిపడితే

మునిగిపోతావురా!


తెల్లనివన్నీ

పాలనుకుంటే

మోసపోదువురా!


చూచినవన్నీ

కావాలంటే

శ్రమతప్పదురా!


కోరినకోర్కెలన్నీ

తీరాలంటే

కృషిచెయ్యాలిరా!


కానివిషయాలలో

తలదూరిస్తే

కాలిపోతావురా!


బక్కవాడని

అవహేళనచేస్తే

పోరుతప్పదురా!


బీదవాడని

ఉపేక్షిస్తే

తిరుగుబాటుతప్పదురా!


బడుగువాడని

బయటపెడితే

ఎదురుతిరుగునురా!


మూతిముడిచి

మూలనకూర్చుంటే

మూగవాడంటారురా!


లోతుతెలుసుకోక

ఏటిలోదిగితే

కొట్టుకుపోతావురా!


అన్నీతెలుసుకొనక

అడుగులేస్తే

అనర్ధదాయకమురా!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog