కవితలకూర్పు
చూచినవి
ఆకర్షిస్తేగాని
కవితలను
కూర్చలేకపోతున్నా
విన్నవి
నచ్చితేగాని
కైతలని
వెల్లడించలేకపోతున్నా
చదినవి
వెంటబడితేగాని
కయితలను
వ్రాయలేకపోతున్నా
అక్షరాలు
అల్లుకుంటేగాని
అచ్చతెలుగురాతలు
అల్లలేకపోతున్నా
పదాలు
పారితేగాని
పుటలను
నింపలేకపోతున్నా
ఆలోచనలు
ఆవహిస్తేగాని
అద్భుతవ్రాతలు
ఆవిష్కరించలేకపోతున్నా
భావాలు
బలపడితేగాని
సాహిత్యమును
సృష్టించలేకపోతున్నా
మహాకవులు
మార్గంచూపితేగాని
మంచిరచనలను
ముందుంచలేకపోతున్నా
పాఠకులు
ప్రోత్సహిస్తేగాని
పేనాను
పట్టుకోలేకపోతున్నా
తెలుగుతల్లి
తలనుతట్టి
తలపులిస్తేగాని
తృప్తిగాకవనంచేయలేకపోతున్నా
వాణీదేవి
వరమిస్తేగాని
విన్నూతనవ్రాతలు
విరచించలేకపోతున్నా
వ్రాయటం
అదృష్టఫలం
అభిలాషనీయం
ఆనందకరం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment