ఓ వర్ధమానకవీ!


దమ్ము చూపరా

దుమ్ము లేపరా

కలం పట్టరా

గళం విప్పరా


నిప్పులు చిందరా

నిగ్గును తేల్చరా

పౌరుషం చూపరా

స్వాభిమానం చాటరా


పదాలు పేర్చరా

పెదాలు విప్పరా

మీసం మెలివేయరా

మౌనం వీడరా


నోర్లు మూయించరా

తలలు దింపించరా

కల్లు తెరిపించరా

వళ్ళు మరిపించరా


అక్షరాలను ముత్యాల్లా కూర్చరా

పదాలను దివ్వెల్లా వెలిగించరా

మాటల గారడిచెయ్యరా

నాల్కల కరిపించరా


తుపాకులు పట్టరా

తూటాలు పేల్చరా

తలలు తట్టరా

తలపులు లేపరా


ఒకరంటారు

కవిసమ్మేళనమంటే

చెట్లమీదకాకుల్లాగా

కవులు వాలుతారట


కాకులు

కావుకావు మన్నట్లు

కవులుగుంపుగాచేరి

కూస్తారట


సన్మానాలంటే

శాలువాలంటే

ప్రశంసాపత్రాలంటే

పరుగెత్తుతారట


మరొకరంటారు

గురుత్వాకర్షణలేని

పసలేనిపదాలవెంట

కవులుపడుతున్నారట


కవులకాలనీకి

తీసుకొచ్చినవారిని

తిట్టాలట

తన్నాలట


పచ్చపచ్చని

కవిత్వమైదాలాను

పనీపాటలేనికవులు

నాశనంచేస్తున్నారట


చూడు విసుర్లు

కను విమర్శలు

మీసం తీసెయ్యి

మౌనం వహించు


లేదంటే

సవాలు తీసుకో

సమాధానం చెప్పు

మాటలు వెనుకకుతీయించు


కూరల్లో

ఉప్పుకారం వేసినట్లు

కవితల్లో

తీపిసౌరభం కలుపు


పాఠకులమనసులు

తట్టిలేపు

విమర్శకులమూతులు

మూయించు


బాగా వ్రాయి

బుద్ధి చెప్పు

బాధను అర్ధంచేసుకో

వ్యధను తొలిగించు


లేకుంటే

నీరులేని బావిలోదూకు

పరుగెత్తే

రైలుకింద తలనుపెట్టు


కవులు

గుడ్డివాళ్ళుకాదు

చెమిటివాళ్ళుకాదు

అమాయకులుకాదు


మనకవులు

మాతృభాషరక్షకులు

భాషాప్రేమికులు

తెలుగుతల్లిపుత్రులు


కవులకు

జైకొట్టండి

కవితలను

స్వాగతించండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog