నా తెలుగు


భాషలలో బహుగొప్ప

నా తెలుగుభాష

జాతులలో కడుమేటి

నా తెలుగుజాతి


వన్నెచిన్నెలున్న

ఒయ్యారి నాతెలుగు 

కళాకాంతులున్న

కమ్మనిది నాతెలుగు  


తేనెలుచిందేటి

తియ్యనిది నాతెలుగు 

వెలుగులుచిందేటి

వెలుతురు నాతెలుగు 


పరిమళాలుచిందేటి

పూదోట నాతెలుగు 

చిరునవ్వులుకురిసేటి

చంద్రముఖి నాతెలుగు 


మనసులుముట్టేటి

మున్నాడి నాతెలుగు 

గుండెలుదోచేటి

గుమ్మాడి నాతెలుగు 


ముద్దులొలికేటి

చిన్నారి నాతెలుగు 

ముద్దుమాటలాడేటి

పొన్నారి నాతెలుగు 


వెన్నెలచల్లేటి

జాబిలి నాతెలుగు

తళతళమెరిసేటి

తారక నాతెలుగు


హంసలానడిచేటి

కులుకులాడి నాతెలుగు

నెమలిలానాట్యమాడేటి

నర్తకీమణి నాతెలుగు


చిలుకలాపలికేటి

చక్కెర నాతెలుగు

కోకిలలాపాడేటి

గానము నాతెలుగు


గోదారిలాసాగేటి

వేదము నాతెలుగు

క్రిష్ణలాపారేటి

కావ్యము నాతెలుగు


అమృతముతోనిండిన

భాండము నాతెలుగు

షడ్రుచులుయున్నట్టి

భోజనము నాతెలుగు


ముత్యాల్లాంటి

అక్షరాలుకలది నాతెలుగు

పంచదారలాంటి

పలుపదాలున్నది నాతెలుగు


ఉగ్గుపాలతో

వచ్చేది నాతెలుగు

ఉయ్యలపాటలతో

నేర్చేది నాతెలుగు


తల్లివంటి

దేవత నాతెలుగు

తండ్రివంటి

చేయూత నాతెలుగు


సరళమైనది

నా తేటతెలుగు

స్వచ్ఛమైనది

నా తెలుగురత్నము


తెలుగుతల్లికి

తలవంచుతా

తెలుగువారికి

తోడుగానిలుస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 



Comments

Popular posts from this blog