ఎవరివో? నీవెవరివో?


ఎవరివో? నీవెవరివో?

తేటతేట తెలుగువా

తాజాతాజా పువ్వువా

తెల్లవారి వెలుగువా


తెలుగుతోట

పూచిన

సుందర సుమానివా

సౌరభాల సారంగివా


తెలుగుబాట

పట్టిన

ప్రీతిగల పుత్రుడివా

ప్రేమచూపు పుత్రికవా


తెలుగుపాట

పాడేటి

కమ్మని కంఠానివా

సరాగాల స్రవంతివా


తెలుగునోట

చిందేటి

తేనెల పలుకులువా

తీయని పాయసానివా


తెలుగునేల

మురిసేటి

ముద్దుల బిడ్డవా

నవ్వుల పాపవా


తెలుగుమదులు

తొలిచేటి

అందాల దృశ్యానివా

ఆనందాల కారణివా


తెలుగుభూమిన

కురిసేటి

అమృత జల్లువా

శ్వేత హిమానివా


తెలుగుదేశాన

పారేటి

సుజల స్రవమువా

సస్య సౌభాగ్యానివా


తెలుగువాడు

చూపేటి

తెగువవా

తెలివివా


తెలుగుతల్లి

కన్నట్టి

వరాల కొడుకువా

గారాబాల కూతురివా


తెలుగుభాష

చిందేటి

వెలుగువా

వెన్నెలవా


తెలుగుకవి

వ్రాసిన

చక్కని కావ్యానివా

చిక్కని కవిత్వానివా


ఎవరివో? నీవెవరివో?

మరంద మందారానివా

మత్తెక్కించె మల్లియవా

తుమ్మెదతాకని తామరవా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog