మన తెలుగువెలుగులు
తెలుగువెలుగు
తిమిరాఙ్ఞానమును తరిమేస్తుంది
తెలుగుతళుకు
మంచిభావాలను మదిలోరేపుతుంది
తెలుగుజ్యోతి
తనువులుతట్టి చూడమంటుంది
తెలుగుకాంతి
తలలో తలపులుపారిస్తుంది
తెలుగుతేజము
దేశవిదేశాల వర్ధిల్లుతుంది
తెలుగుదీపము
సుందరదృశ్యాలను చూపిస్తుంది
తెలుగుప్రకాశం
తెలివిని పంచుతుంది
తెలుగుమయూఖం
మదులలో తిష్టవేస్తుంది
తెలుగురోచిస్సు
దశదిశలా వ్యాపిస్తుంది
తెలుగుభాసము
దేశబాషలలో మేటిచేస్తుంది
తెలుగుదీప్తి
కీర్తిపతాకం ఎగిరిస్తుంది
తెలుగురశ్మి
రసప్రాప్తిని కలిగిస్తుంది
తెలుగుకళ
కమ్మదనాలు చూడమంటుంది
తెలుగువెన్నెల
కుతూహలము కలిగిస్తుంది
తెలుగుతేజస్సు
ముఖాలను మెరిపిస్తుంది
తెలుగువర్చస్సు
వదనాలను వికసింపజేస్తుంది
తెలుగుమినుకు
పలువురిదృష్టిని ఆకట్టుకుంటుంది
తెలుగుబెళుకు
కళ్ళను కళకళలాడిస్తుంది
తెలుగుశిఖ
ఉన్నతశిఖరాలకు తీసుకెళ్తుంది
తెలుగుజిగి
పదాలను ధగధగలాడిస్తుంది
తెలుగునిగ్గు
నిజానిజాల నిగ్గుతేలుస్తుంది
తెలుగుజ్వాల
మనసులను మురిపిస్తుంది
తెలుగుశోభ
చక్కదనాలకు చోటిస్తుంది
తెలుగుప్రభ
ప్రతిభకు పట్టంకట్టిస్తుంది
తెలుగుబిడ్డా
తలెత్తుకొని త్రుళ్ళిపడరా
తెలుగువాడా
తనివితీరా తృప్తిపడరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment