కవనధ్యాస
పూల పొంకపరిమళాలను
కౌముది కమ్మదనాలను
సహజప్రకృతి సోయగాలను
పుటలపై పెట్టాలనియుంది
అందాల దృశ్యాలను
ఆనంద భావాలను
అద్భుత విషయాలను
అక్షరాలతో ఆవిష్కరించాలనియుంది
ప్రభోధ గేయాలను
ప్రణయ గీతాలను
పిల్లల పాటల్లను
పదాలతో పారించాలనియుంది
ప్రభాత సూర్యుడిని
పున్నమి చంద్రుడిని
తారల తళుకులని
వివరంగ వర్ణించాలనియుంది
ప్రేమాభిమానాలను
స్నేహబంధాలను
తలలోనితలపులను
సాహిత్యలోకంలో చాటాలనియుంది
ఛందోబద్ధ పద్యాలను
ప్రాసయుక్త కవితలను
స్వరానుకూల పాటలను
దండిగ సృష్టించాలనియుంది
యదార్ధ సంఘటలను
జీవిత సత్యాలను
వర్తమాన విషయాలను
శాశ్వతకవితలుగా మార్చాలనియుంది
నదీ ప్రవాహాలను
కడలి తరంగాలను
ముత్యాల వానజల్లులను
కవితలాలో గుప్పించాలనియుంది
కోకిల గానాలను
నెమలి నాట్యాలను
చిలుకల పలుకులను
కైతలలో చొప్పించాలనియుంది
కవిత కవ్వించితే
సాహితి సమ్మతిస్తే
సరస్వతి కరుణిస్తే
పలుకయితలను పుట్టించాలనియుంది
తెలుగుభాష తీపిని
తెలుగుజాతి తేజాన్ని
తెలుగుతల్లి తపనని
తేటతేటతెలుగులో తెలపాలనియుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment