ఓ పాఠకా!


కాగితంపైని

అక్షరాలని

ఆదినుండి

అంతంవరకి

అర్ధమయ్యేదాకా

చదువూ చదువూ


పుటలమీద

పేర్చినపదముల

ప్రాసప్రయోగముల

పొర్లుపోవనీక

పూర్తయ్యేదాకా

చదువూ చదువూ


కవిమనసుల్లో

పుట్టిపొంగిపొర్లిన

భావములను

కడవరకు

మనసులోనిలిచేదాకా

చదువూ చదువూ


కవులుకూర్చిన

కమ్మనికవితలను

మొదటినుండి

చివరివరకు

కడుపునిండేదాకా

చదువూ చదువూ


కవిహృదయాన్ని

కనిపెట్టేవరకు

అంతరంగాన్ని

అంటుకునేవరకు

ఆస్వాదించేదాకా

చదువూ చదువూ


కథలను

కవితలను

పద్యాలను

పురాణాలను

చిక్కినవన్నీ

చదువూ చదువూ


పుష్పకైతలను

ప్రేమకవితలను

భావకయితలను

ఇతరకవనాలను

దొరికినవన్నీ

చదువూ చదువూ


పాతరచనలను

ప్రస్తుతరచనలను

వర్ధమానరచనలను

వివిధరచనలను

అందినవన్నీ

చదువూ చదువూ


దినపత్రికలను

వారపత్రికలను

మాసపత్రికలను

ప్రత్యేకప్రచురణలను

అందినవన్నీ

చదువూ చదువూ


ఈకవనాన్ని

ప్రభోదమనుకోకు

పాఠకులనుచదివి

పొగడమన్నానుకోకు

మంచిరాతలన్నింటినీ

చదువూ చదువూ


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog