కవిగారి భావకవితలు
కవిగారు
కలమును
తేనెతో నింపారేమో
కవితలు తీపిగాయుంటున్నాయి
కవిగారు
అక్షరాలమీద
అత్తరు చల్లారేమో
పరిమళాలు వెదజల్లుతున్నాయి
కవిగారు
పదములను
మత్తులో ముంచారేమో
మైకంలో ముంచేస్తున్నాయి
కవిగారు
పంక్తులకు
సూదంటురాళ్ళు తగిలించారేమో
మనసులను లాగేస్తున్నాయి
కవిగారు
కవనంతో
గారడి చేస్తున్నారేమో
భ్రమలు కలిగిస్తున్నాయి
కవిగారు
ఆకాశంలో
కవనమేఘాలను సృష్టిస్తున్నారేమో
కవితాజల్లులు తడిపేస్తున్నాయి
కవిగారు
రవికిరణాలను
గుప్పెటలో దాచుకున్నారేమో
తెలుగుపై వెదజల్లుతున్నారు
కవిగారు
ఆలోచనలను
నదిలా పారిస్తున్నారేమో
నిత్యకైతలతో ముంచేస్తున్నారు
కవిగారు
మాటలను
కాచి వడగట్టారేమో
చక్కగా వినియోగిస్తున్నారు
కవిగారు
పాఠకుల
మనసులు చదివారేమో
కోరుకున్నకైతలు అందిస్తున్నారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment