కవితా! ఓ కవితా!


నీవు

నాతోడుంటే

దృశ్యాలపై దృష్టిసారిస్తా

అందాలకవితలుగా మార్చుతా


నీవు

నావెంటుంటే

అక్షరాలను పువ్వుల్లా అల్లుతా

పదాలను నదినీరులా పారిస్తా


నీవు

నాకునీడనిస్తే

రెక్కలకష్టం మరుస్తా

అద్భుతకవనాలు వెలువరిస్తా


నీవు

నాకు ఊహలిస్తే

చిక్కనిపదాలను ప్రయోగిస్తా

చక్కని కైతలనుసృష్టిస్తా


నీవు

నాకు ఊతమిస్తే

కవితాశిఖరాలను అధిరోహిస్తా

ఉన్నతమైనభావాలను వ్యక్తీకరిస్తా


నీవు 

నాకు అండగానిలిస్తే

కవిత్వలోతుల్లోకి వెళ్తా

గాఢమైనసాహిత్యాన్ని వెల్లడిస్తా


నీవు

నా పక్కనుంటే

ప్రకృతిని తిలకిస్తా

సహజసౌందర్యాలను వర్ణిస్తా


నీవు

నామదిలో నిలిస్తే

కవితాజల్లులు కురిపిస్తా

పాఠకులను మురిపిస్తా


నీవు

నా వెన్నుతడితే

ఆకాశంలో విహరించొస్తా

రవిచంద్రతారకుల కైతలుకూర్చుతా


నీవు

నన్ను ప్రోత్సహిస్తే

కవనసేద్యం సాగిస్తా

కవితాపంటలు పండిస్తా


కవితా

నా వెంటనడు

నాచేత

కైతలు వ్రాయించు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog