ఓ కవివర్యా!
అక్షరాలు
ఆరబోస్తావేంటి?
అందినవాళ్ళు
అందినట్లు ఆరగించరా!
పదాలు
పారబోస్తావేంటి?
ప్రక్కనున్నవాళ్ళు
పాత్రలలో పట్టుకొనిత్రాగరా!
ఆలోచనలు
అప్పుచెపుతావేంటి?
అందుకున్నవాళ్ళు
తలల్లోకి ఎక్కించుకోరా!
విషయాలు
విసురుతావేంటి?
విఙ్ఞులు
విందులా భోంచేయరా!
కవితలు
కారుస్తావేంటి?
చిక్కినవాళ్ళు
చిక్కినట్లు స్వీకరించరా!
తెలుగును
పుటలపైపోస్తావేంటి?
తేటుల్లా
తేననుకొని త్రాగరా!
అంధ్రభాషను
ఆలాచల్లుతావేంటి?
అమృతమనుకొని
అందినవాళ్ళు ఆస్వాదించరా!
సాహిత్యఖజానాను
తెరిచిపెడతావేంటి?
తెలుగుభాషాభిమానులు
తిన్నగా తీసుకొనిపోరా!
సాహితీవిందుకు
స్వాగతిస్తున్నావేంటి?
సర్వులు
షడృచులను చవికొనరా!
ఆహా!
తెలుగుసాహితీభోజనము
ఎంతరుచి
ఎంతశుచి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment