ఓ పాఠకా!


కవినాటిన కవనమొక్కలను

పీకుతావో

సాకుతావో

నీ ఇష్టం ఆలోచించు


కవికూర్చిన అక్షరాలను

రోట్లోవేసి దంచుతావో

నోట్లోవేసి నానుస్తావో

నీ ఇష్టం ఆలోచించు


కవిపారించిన పదాలను

పెడచెవినిపెడతావో

పెదాలకందిస్తావో

నీ ఇష్టం ఆలోచించు


కవితెలిపిన ఆలోచనలను

చెత్తనుకుంటావో

ఉత్తమమనుకుంటావో

నీ ఇష్టం ఆలోచించు


కవిచెప్పిన భావాలను

కంపనుకుంటావో

ఇంపనుకుంటావో

నీ ఇష్టం ఆలోచించు


కవిచూపిన అందాలను

అసహ్యించుకుంటావో

అంతరంగంలోనిలుపుకుంటావో

నీ ఇష్టం ఆలోచించు


కవిచేర్చే ఆనందాలను

ఏమరుస్తావో

ఆస్వాదిస్తావో

నీ ఇష్టం ఆలోచించు


కవుల కవితలను

వదిలిపారేస్తావో

వంటికెక్కించుకుంటావో

నీ ఇష్టం ఆలోచించు


కవిత్వాని

ద్వేషిస్తావో

ప్రేమిస్తావో

నీ ఇష్టం ఆలోచించు


సాహిత్యాన్ని

సాగనంపుతావో

స్వాగతిస్తావో

నీ ఇష్టం ఆలోచించు


కవిహృదయాన్ని

తెలుసుకో

కవిత్వసారాన్ని

క్రోలుకో


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం









Comments

Popular posts from this blog