ఎందుకో? ఏమో?


తలుపులు తెరచి

లోకాన్నిచూడాలనియున్నది


చూపులు సారించి

లోతులుకాంచాలనియున్నది


మనసుదాల్చిన మౌనాన్ని

వీడాలనియున్నది


మూసుకున్న పెదవులను

తెరవాలనియున్నది


నోటిలోని మాటలను

వదలాలనియున్నది


గుప్పెటలోని గుట్టును

విప్పాలనియున్నది


గుండెలోని దాపరకాన్ని

వెల్లడించాలనియున్నది


హృదిలోని ప్రేమను

బయటపెట్టాలనియున్నది


తలలోని తలపులను

తెలియజేయాలనియున్నది


కడుపులోని మర్మాన్ని

కక్కాలనియున్నది


కంటినికట్టేసిన దృశ్యాన్ని

వర్ణించాలనియున్నది


కలకన్న విషయాలను

కవితగావ్రాయాలనియున్నది


దుర్మార్గుల దుశ్చర్యలను

దూషించాలనియున్నది


సమాజములోని కల్మషాన్ని

కడిగిపారేయాలనియున్నది


అంతరంగాన్ని అందంగా

ఆవిష్కరించాలనియున్నది


మదిలోని భావాలను

చెప్పాలనియున్నది


తెల్లనివన్ని పాలుకాదని

తెలుపాలనియున్నది


వినినవన్ని నిజాలుకాదని

వివరించాలనియున్నది


గళమెత్తి గాంధర్వగానాన్ని

గట్టిగా ఆలపించాలనియున్నది


కమ్మనైన కవితను

పఠించాలనియున్నది


ఎదలోని ఆలోచనలను

ఎరిగించాలనియున్నది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog