నేను 


నీటిపై తేలుతాను

గాలిలో ఎగురుతాను


భూమిపై నడుస్తాను

నింగిలో విహరిస్తాను


పూదోటల్లో తిరుగుతాను

ఉయ్యాలల్లో ఊగుతాను


పొంకాలు చూపుతాను

పరిమళాలు పీలుస్తాను


పువ్వులను పరికిస్తాను

నవ్వులను కురిపిస్తాను


కొండలను అధిరోహిస్తాను

కోనలలో చరించుతాను


నదుల్లో మునుగుతాను

కడలిలో తేలుతాను


ఆటలు ఆడిస్తాను

పాటలు పాడిస్తాను


హద్దులు దాటిస్తాను

సుద్దులు చెప్పిస్తాను


అందాలు చూపిస్తాను

ఆనందాలు చేరుస్తాను


కలాల్లో దూరతాను

కాగితాలపై కూర్చుంటాను


అక్షరాలు అమరుస్తాను

పదాలు పేరుస్తాను


తలపులు తెలుపుతాను

భావాలు బయటపెడతాను


మస్తకాలనుంచి వెలువడుతాను

పుస్తకాలలో ప్రతిబింబిస్తాను


కవనాలను కూర్పించుతాను

సాహిత్యాన్ని సృష్టించుతాను


కలలులోకి వస్తాను

కల్పితాలు చేయిస్తాను


భ్రమలు కలిపిస్తాను

ఆశలు రేకెత్తిస్తాను


మెదడులు ముడతాను

తలలను తడతాను


కనిపించక వినిపిస్తాను

కర్ణాలకు విందునిస్తాను


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog