అక్షరవిన్యాసాలు
(అక్షరాల అభ్యర్ధనలు)
అక్షరాలు
ఆనందమిచ్చేలా
అందంగాపొసగి
అందించమంటున్నాయి
అక్షరాలు
దీపాల్లా
వరుసగాపెట్టి
వెలిగించమంటున్నాయి
అక్షరాలు
ముత్యాల్లా
దండగాగుచ్చి
ధరింపజేయమంటున్నాయి
అక్షరాలు
కిరణాల్లా
వెదజల్లి
కళకళలాడించమంటున్నాయి
అక్షరాలు
అత్తరులా
సుమసౌరభాలను
చల్లమంటున్నాయి
అక్షరాలు
తేనెలా
తియ్యదనాన్ని
పంచిపెట్టమంటున్నాయి
అక్షరాలు
జాబిలిలా
వెన్నెలను
వెదజల్లమంటున్నాయి
అక్షరాలు
హరివిల్లులా
వర్ణాలను
చూపమంటున్నాయి
అక్షరాలు
అమృతంలా
అధరాలపై
చల్లమంటున్నాయి
అక్షరాలు
వానజల్లులా
అంతరంగాలపై
కురిపించమంటున్నాయి
అక్షరాలు
పక్షుల్లా
ఆకాశంలో
ఎగిరించమంటున్నాయి
అక్షరాలు
పంచభక్ష్యాల్లా
వండివార్చి
వడ్డించమంటున్నాయి
అక్షరాలు
నీరులా
ముందుకు
పారించమంటున్నాయి
అక్షరాలు
గేయంగా
కూర్చి
పాడించమంటున్నాయి
అక్షరాలు
కవితగా
అమర్చి
ఆలపింపచేయమంటున్నాయి
అక్షరాలను
ఆహ్వానిస్తా
అందంగా
ఆవిష్కరిస్తా
అక్షరాలకోర్కెలను
ఆమోదిస్తా
ఆశించినట్లే
ఆచరణలోపెడతా
అక్షరాలను
అందరికందిస్తా
అంతరంగాలలో
ఆవాసముంటా
అక్షరదేవతలను
ఆరాధిస్తా
అనునిత్యమూ
ఆహ్లాదపరుస్తా
ప్రసారసాధనాలకు
వందనాలు
పాఠకసమూహాలకు
ధన్యవాదాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment