అందచందాలు
అందంగా
అందరికీ కనపడాలనియున్నది
ఆనందాన్ని
అందరికీ పంచాలనియున్నది
కమ్మగా
ఎల్లవారునీ పలుకరించాలనియున్నది
కబుర్లుచెప్పి
ఎల్లరునీ కుతూహలపరచాలనియున్నది
చక్కగా
సర్వులతో మాట్లాడాలనియున్నది
చిరునవ్వులని
సర్వులతో చిందించాలనియున్నది
సుందరమైన
చిత్రమొకటి గీయాలనియున్నది
చూపరుల
చిత్తాలను తట్టాలనియున్నది
పూలపొంకాలను
పలువురితో పరికింపజేయాలనియున్నది
పరిసరాలందు
పరిమళాలను ప్రసరింపజేయాలనియున్నది
ముగ్ధమోహనమైన
మానినిని మచ్చికచేసుకోవాలనియున్నది
మూడుముళ్ళువేసి
మమతానరాగాలుపంచి మురిపించాలనియున్నది
మురిపాల
పాపాయిలను ముద్దాడాలనియున్నది
ముద్దుముద్దు
మాటలనువిని సంతసించాలనియున్నది
రమణీయ
దృశ్యాలని కాంచాలనియున్నది
ప్రకృతినిచూచి
పరవశంతో పొంగిపోవాలనియున్నది
జాను
తెలుగులోన పాడాలనియున్నది
జనులనెల్ల
జాగృతము చేయాలనియున్నది
ముచ్చటైన
కవితనొకటి వ్రాయాలనియున్నది
పాఠకుల
మదులను దోచుకోవాలనియున్నది
అందాలను
చూడండి
ఆనందాలను
పొందండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment